కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటి, ఎలక్ర్ట్రానిక్స్ కంపెనీలతో పాటు కొత్తగా రావడానికి ఆసక్తి చూపే పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉండవల్లిలోని నివాసంలో ఐటి , ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కొత్తగా ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలను ఆకర్షించడానికి మెరుగైన విధానాలతో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు, పాలసీలు రూపొందించాలని స్పష్టం చేశారు.
విశాఖపట్నంలో ఐటి పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌పై నివేదికతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూమిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమదారులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కరించాలని, పారిశ్రామికవేత్తలతో స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.