చేనేత కార్మికులకు చేయూత
ప్రకటించిన తెలుగుదేశం పార్టీ చీఫ్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా చేనేత కార్మికుల గురించి ప్రస్తావించారు. వారు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , అత్యంత నైపుణ్యంతో కూడిన వారి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. వారి కుల వృత్తిని ప్రోత్సహించేందుకు తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నిరంతరం మగ్గాలతో జీవితాలు గడిపే చేనేత కార్మికులకు పూర్తిగా 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని చెప్పారు నారా లోకేష్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. జగన్ రెడ్డి పాలనకు మూడిందన్నారు. ఆయన ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఆచరణకు నోచుకోని హామీలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడంటూ ధ్వజమెత్తారు.
తాను మరోసారి సీఎం అవుతానని కలలు కంటున్నాడని, ఆ కలలు కల్లలు అయ్యే రోజు త్వరలోనే ఉందన్నారు నారా లోకేష్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని , తమ విలువైన ఓటు తమకే వేయాలని కోరారు .