గుడ్లవల్లేరు కాలేజీ ఘటన కట్టుకథ – నారా లోకేష్
రహస్య కెమెరాల కథ బ్లూ మీడియా సృష్టేనని ఫైర్
మంగళగిరి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి మాత్రమేనని ఆరోపించారు.
అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించ లేదని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైసిపి నేతల సినీనటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వరుసగా బయట పడుతుండడంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు.
విద్యా శాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా తన బిడ్డల్లాంటి వారేనని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు నారా లోకేష్.
గుడ్లవల్లేరులో నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటెయిన్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
నూజివీడు ట్రిపుల్ ఐటిలో ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరక్టర్ ను విధులనుంచి తొలగించామని, ముగ్గురు ఉన్నతాధికారులతో పర్యవేక్షక కమిటీని నియమించామని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి మాదిరిగా తాను తల్లీ, చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం కాదని, విద్యార్థినులను తన తోబుట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతానని ప్రకటించారు.
నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం వేల కోట్ల ఖర్చు చేసినట్లు తప్పుడు లెక్కలు చెబుతోందని, అదే నిజమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత అయిదేళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు.
డిజిటల్ క్లాస్ రూమ్ లు జగన్ కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అవి అంతకు ముందే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వపాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి వందల కోట్లు దిగమింగారని దుయ్యబట్టారు.