శాసనసభలో మంత్రి నారా లోకేష్
అమరావతి – రాష్ట్రంలో మనబడి మన భవిష్యత్తు పథకంలో ఫేజ్1,2,3 కింద చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని దశల వారీగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పనుల పురోగతిపై వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, కోళ్ల లలితకుమారి, గౌతు శిరీష, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం చేపట్టిన ఫేజ్-1,2 లోనే అనేక పనులు పెండింగ్ లో పెట్టారని తెలిఆపరు. ఫేజ్-1,2 పనులు పూర్తి చేయడానికి రూ. 4,789 కోట్లు అవసరం అన్నారు.
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం విడుదల చేసిన అసంబద్ధమైన జిఓ 117ను రద్దు చేస్తామని చెప్పామన్నారు. దీనివల్ల ప్రాథమిక విద్యకు పేద బిడ్డలు దూరమవుతారని తెలిపారు. అందులో భాగంగా జిఓ 117కి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించామన్నారు. దాని ఆధారంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్చక్చర్ కు స్టార్ రేటింగ్ ఇచ్చామన్నారు. తాను పరిశీలించినపుడు కొన్ని పాఠశాలల్లో టీవీలు, బెంచిలు, రంగులు ఉన్నాయన్నారు.
కొన్నింటిలో అసలు ఏమి లేవు. అవి చూశాక రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, బల్లలు, తాగునీరు, విద్యుత్, టాయ్ లెట్స్ వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అన్ని ప్రభుత్వ పాఠశాలలను 5 స్టార్ రేటింగ్ కు తేవాలంటే రూ.13, 524 కోట్లు అవసరమన్నారు.