సీఈవో రవికుమార్ తో లోకేష్ భేటీ
దావోస్ – దావోస్ పర్యటనలో భాగంగా కీలకమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు ఏపీ కీలకమైన ప్రాంతంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్బంగా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తో భేటీ అయ్యారు. తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించేందుకు కావాల్సిన వసతి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారు కాగ్నిజెంట్ సిఇఓ.
రవికుమార్ తో భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడడం, సానుకూలమైన వాతావరణం నెలకొనడంతో దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో భారీగా వర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉన్నట్లు లోకేష్ స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు, ఇబ్బందులు లేకుండా కంపెనీలు స్థాపించేందుకు, పెట్టుబడిదారులకు లైన్ క్లియర్ చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పర్మిషన్ ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా కాగ్నిజెంట్ ఏపీపై ఫోకస్ పెట్టనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.