సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవోతో లోకేష్ భేటీ
టెక్ స్టార్టప్ లకు ఏఐ టూల్స్ అందించాలి
అమెరికా – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం జరిగిన సినర్జీ సమ్మిట్ లో కీలకమైన ఐటీ దిగ్గజ కంపెనీలతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్‍తో సమావేశం అయ్యారు నారా లోకేష్.
టెక్ స్టార్టప్‍లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించాలని ..ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు. విద్యా సంస్థలతో సేల్స్ ఫోర్స్ సంస్థ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా సీఈవో క్లారా షిహ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు మంత్రి నారా లోకేష్.
అంతకు ముందు రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో సమావేశమయ్యారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరారు.
రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్బంగా రేవేచర్ సీఈవో అశ్విన్ భరత్ నారా లోకేష్ చేసిన విన్నపానికి స్పందించారు. ఈ మేరకు ఏపీలో సెంటర్ నెలకొల్పే విషయంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. సీఈవోకు ధన్యవాదాలు తెలిపారు నారా లోకేష్.