పునరుత్పాదక శక్తికి వేదాంత తోడ్పాటు
వేదాంత కంపెనీ ప్రతినిధితో నారా లోకేష్
ముంబై – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దూకుడు పెంచారు. ఆయన ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడంపై ఫోకస్ పెట్టారు. ప్రధానంగా ఐటీ, వ్యాపార, వాణిజ్య, లాజిస్టిక్, పునరుత్పాదక, తదితర రంగాలలో పెట్టుబడిదారులు, కంపెనీలు ఏపీలో స్థాపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సైతం ఏపీ డెవలప్ మెంట్ పై ఎక్కువగా దృష్టి సారించారు.
ఇందులో భాగంగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన సమ్మిట్ లో పాల్గొన్నారు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. వేదాంత సీఈఓను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఏపీలో 10 జీడబ్ల్యూ పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయడానికి వారి అద్భుతమైన ప్రణాళికల గురించి తెలుసుకున్నందుకు తాను సంతోషిస్తున్నట్లు స్పష్టం చేశారు నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2030 నాటికి 72 జిడబ్ల్యూ పునరుత్పాదక ఇంధనాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మరింత మంది కార్పొరేట్లు ,పెట్టుబడిదారులు పాల్గొనేందుకు తాము ఎదురు చూస్తున్నట్లు తెలిపారు నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పునరుత్పాదక సామర్థ్యాన్ని ఉపయోగించు కోవడానికి , ఉద్యోగాలను సృష్టించడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందజేస్తామని ఈ సందర్బంగా వేదాంత గ్రూప్ కు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు నారా లోకేష్.