ఏపీలో ఐటీ కార్యకలాపాలు చేపట్టండి
దావోస్ – మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు దావోస్ పర్యటనలో. ఆయన దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులతో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. ఐటీ దిగ్గజ సంస్థ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్ జీతో సమావేశమయ్యారు. ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, విశాఖ, విజయవాడ, తిరుపతిలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించమని కోరారు. HCL, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, జోహో, WNS గ్లోబల్ సర్వీసెస్, సియంట్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.
త్వరలో విశాఖపట్నానికి TCS రాబోతోందని, ఏపీలో ఐటి సంస్థలకు పూర్తి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. మరో వైపు ప్రపంచ దిగ్గ సంస్థ గూగుల్ క్లౌడ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. అంతే కాకుండా గూగుల్ ఐటీ సిటీని విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతోందని, దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు విప్రో వైస్ చైర్మన్ రషిద్ ప్రేమ్ జీ. త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియ చేస్తామని హామీ ఇచ్చారు.