విద్యా దీవెన చెల్లింపులపై ఫోకస్
కాలేజీల్లో ఉండి పోయిన సర్టిఫికెట్లు
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగంపై ఫోకస్ పెట్టారు. త్వరలో కాలేజీల యాజమాన్యాలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. విద్యా శాఖకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రధానంగా కాలేజీల్లో ఉండి పోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేశారు నారా లోకేష్.
కాలేజీల వద్ద ఎంత మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయన్న విషయంపై లోకేష్ ఆరా తీశారు. ఏపీ వ్యాప్తంగా 8 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉన్నాయని ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
ఇదిలా ఉండగా సర్టిఫికెట్లు 8 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి ఇప్పించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు నారా లోకేష్. పెండింగ్‍లో రూ.3,500 కోట్ల మేర విద్యా దీవెన కింద చెల్లించాల్సి ఉందన్నారు .
గత వైసీపీ ప్రభుత్వం విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేయకుండా పెండింగ్ పెట్టడంతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆయా కాలేజీల యాజమాన్యాలు నిలిపి వేశాయని , దీనిని సాధ్యమైనంత మేర చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.
ఇదిలా ఉండగా ఆరు విడతల్లో బకాయిలను చెల్లించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు.