సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి
విజయవాడ – ఏపీలో కొనసాగుతున్న వర్షాల కారణంగా చేపడుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఏర్పాట్లపై పర్యవేక్షించారు.
వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాలపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు నిరాశ్రయుల తరలించడం జరిగిందన్నారు.
ఇప్పటి వరకు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుండి 15 వేల మందికి పైగా నిరాశ్రయులను తరలించామని తెలిపారు. వరద బాధితులకు నగరంలోని ప్రధాన కళ్యాణ మండపాలు, హోటళ్లలో ఆశ్రయం కల్పించడం జరిగిందని చెప్పారు.
భారీ వరద కారణంగా నిలిచి పోయిన సెల్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. నగరంలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచి పోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు నారా లోకేష్.