భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి
ఏపీ విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి – వాయవ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కుండ పోతగా కురుస్తున్నాయి. ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితిపై క్షణక్షణం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
బాధితులకు అండగా ఉండేందుకు, సహాయ సహకారాలు అందించేందుకు టీడీపీ కార్యాలయ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గంటగంటకు పరిస్థితులను వాకబు చేస్తూ సహాయక చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు నారా లోకేష్.
ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు అందిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులను కోరారు ఏపీ మంత్రి.