పవర్ లోకి వస్తే 20 లక్షల జాబ్స్
నారా లోకేష్ సంచలన ప్రకటన
అమరావతి – టీడీపీ కూటమి గనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని, ఇక పెట్టే బేడా సర్దు కోవడానికి సిద్దంగా ఉండాలని స్పష్టం చేశారు నారా లోకేష్.
నాలుగున్నర ఏళ్లలో జగన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఇన్నాళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాచరిక పాలన సాగించారంటూ ధ్వజమెత్తారు. ప్రజలు ఆయనను నమ్మడం లేదన్నారు. ఇన్నాళ్ల పాటు నవ రత్నాలు పేరుతో మోసం చేశాడని ఆరోపించారు.
ఇవాళ కనీసం స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు నారా లోకేష్. తాము ఐదేళ్ల కాలంలో 20 లక్షలకు పైగా జాబ్స్ కల్పిస్తామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ అన్నది ప్రధానమని పేర్కొన్నారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు నెలకు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.