ఏపీ సర్కార్ కు మెటా సహకారం – లోకేష్
సంతోషం వ్యక్తం చేసిన ఏపీ ఐటీ మంత్రి
అమరావతి – ఏపీ ప్రభుత్వంతో ప్రముఖ దిగ్గజ సంస్థ మెటా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మెటా సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఏపీ ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో.
మెటా (ఫేస్ బుక్ ) సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే దిగ్గజ సామాజిక సంస్థగా రూపు దిద్దుకుంది. దీనికి మార్క్ జుకెర్ బర్గ్ సీఈవోగా ఉన్నారు. ఇక ఏపీలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటు అయ్యాక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐటీ రంగానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తనయుడు యంగ్ మినిష్టర్ నారా లోకేష్.
ప్రస్తుతం దేశంలోనే తొలి సారిగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో మెటా ప్రతినిధులతో చర్చలు జరిపారు నారా లోకేష్. ఇందులో భాగంగా మెటా సంస్థకు సంబంధించినదే వాట్సాప్. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా దీనిని వాడే వారిలో భారతీయులు ఉన్నారు.
దీంతో వాట్సాప్ ద్వారా పౌర-కేంద్రీకృత ప్రజా సేవలను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం , మెటా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ సహకారాన్ని ప్రకటించినందుకు తాను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్. ఈ సహకారం త్వరలో మెటా వినూత్న సాంకేతికత ద్వారా ప్రజా సేవలను సమర్ధవంతంగా అందజేస్తుందన్నారు.