యూనివర్శిటీలను బలోపేతం చేస్తాం
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి – రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తామని ప్రకటించారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. తాము వచ్చాక విద్యా రంగంపై ఫోకస్ పెట్టామని, బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించామన్నారు. త్వరలోనే వీసీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
రాబోయే ఐదేళ్లలో ఉన్నత విద్యా రంగంలో కీలకమైన మార్పులు తీసుకు వస్తామని చెప్పారు. ప్రధానంగా సిబ్బంది, ఉద్యోగాల కొరత ఉందని, దానిని గుర్తించడం జరిగిందన్నారు. ప్రధానంగా వీసీల నియామకానికి సంబంధించి ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా నియమించేందుకు గాను ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు నారా లోకేష్.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల్లో పరిశోధన, ప్రమాణాల మెరుగుదలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలుకు కసరత్తు ప్రారంభించడం జరిగిందన్నారు .
ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న సుమారు 3,300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ రూపొందించామన్నారు నారా లోకేష్. అనుసంధన్ ప్రాజెక్ట్ కింద పరిశోధనల ప్రోత్సాహానికి ఐదు విశ్వవిద్యాలయాలను గుర్తించడం జరిగిందన్నారు.