ఇంటర్మీడియట్ విద్యలో మార్పులకు శ్రీకారం
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన విద్యా శాఖపై సమీక్ష చేపట్టారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ లో సంస్కరణలకు శ్రీకారం చుడతామని అన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్ సీఈఆర్టీ బుక్స్ ను ప్రవేశ పెడతామని, అంతే కాకుండా ప్రశ్నాపత్రంలో మార్పులు తీసుకు వస్తామన్నారు నారా లోకేష్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు నారా లోకేష్. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రైవేటు ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును ఈ సందర్భంగా అధికారులు వివరించారు. పని దినాలు, అకడమిక్ కేలండర్, సిలబస్, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్-టీచర్ మీటింగ్, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల అటెండెన్స్, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఇంటర్మీడియట్ విద్యపై కనీస సమీక్ష లేదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమవేశంలో ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.