స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి – ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా కూటమి సర్కార్ పని చేస్తోందని చెప్పారు మంత్రి నారా లోకేష్. అందుకే జగన్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చారని, ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని మండిపడ్డారు. కూటమికి ఏకంగా 94 శాతం సీట్లతో విప్లవాత్మకమైన విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతోందన్నారు. అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. యలమంచిలి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
151 సీట్లు 11 కావడానికి గత పాలకుల అరాచకమే కారణమన్నారు. ఈ విప్లవాత్మకమైన ప్రజాతీర్పు సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా నడిపించేందుకు ఇచ్చారని చెప్పారు. అరాచక పాలన నుంచి విముక్తి కోసమే గత ఎన్నికల్లో భారీ ఎత్తున సీట్లు కట్టబెట్టారని అన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 347 కోట్ల అంచనా వ్యయంతో అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కి.మీ.ల పొడవైన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… యువగళం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించానని చెప్పారు. ఆనాడు ప్రజలు పెద్దఎత్తున నా సభలకు వస్తే స్టూలుపై నించుని మాట్లాడా. ఆనాడు ఇదే పోలీసు అధికారులు నా మైక్ లాక్కున్నారు. ఎన్నికల్లో అందరికీ దిమ్మ దిరిగేలా తీర్పు వచ్చిందన్నారు.
ఆనాడు ప్రజా ప్రతినిధులను కలిసేందుకు ప్రజలకు అవకాశం ఉండేది కాదన్నారు. ఫేస్ బుక్ లో పోస్టు పెడితే జైలుకు పంపారు. నాపై 23 కేసులు పెట్టారు, హోం మంత్రి అనితపై కూడా ఆనాటి ప్రభుత్వం 23 కేసులు పెట్టిందన్నారు. పులివెందులలో దళిత మహిళను హత్యచేస్తే చూడటానికి వెళ్తే కూడా ఆమెపై తప్పుడు కేసు పెట్టారు. డైనమిక్ లీడర్ అయ్యన్నపాత్రుడు ప్రజల తరపున పోరాడితే ఆయనపై నిర్భయ కేసు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా ప్రజలు మా వెనుక ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలిచారు. చంద్రబాబు నాయుడును 53 రోజులు బంధిస్తే మీరు అండగా నిలబడ్డారని కొనియాడారు.