మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
అనంతపురం – ఈ రోజు రెన్యూపవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మేం వేస్తున్న పునాదిరాయి..భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి లాంటిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22 వేల కోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. రెన్యూ పవర్ పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నం అన్నారు. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్‌లకు శక్తినివ్వడమే కాకుండా నిరుద్యోగ యువత ఆశయాలకు ఆజ్యం పోస్తుందన్నారు. రేపటి వెలుగుకు దారి చూపుతుందన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమం అని స్పష్టం చేశారు. ఈ రోజు మన కలలకు, భవిష్యత్ తరాలకు వారధి లాంటిది. భూమిపై సూర్యకాంతి, స్వచ్ఛమైన, అమూల్యమైన గాలి లభిస్తున్నపుడు భావితరం కోసం మరోగ్రహం కోసం ఎందుకు ఆలోచించాలి అని ప్రశ్నించారు. శిలాజ ఇంధనాల నుండి భవిష్యత్ ఇంధనాల వినియోగం కోసం మేం ముందడుగు వేస్తున్నాం అన్నారు. భావి తరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు నారా లోకేష్.