స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
న్యూఢిల్లీ: ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కేవలం ఇతర రాష్ట్రాలతో మాత్రమే కాకుండా, ఇతర దేశాలతో కూడా తాము పోటీపడుతున్నట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఐసిఈఎ చైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు మంత్రి లోకేష్ విశదీకరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… దేశంలో పేరెన్నిగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
తరచూ వారితో సమావేశమై పరిశ్రమదారులకు ఎదురయ్యే విధాన పరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటి, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమదారుల కోసం టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోందన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు నారా లోకేష్. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్ అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని అన్నారు.
పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడిబిని పునరుద్దరించామని తెలిపారు లోకేష్, సరైన ప్రాతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పవర్ హౌస్‌గా మార్చడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు.
ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటి పవర్ హౌస్ గా, అంతర్జాతీయ ఎఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృత నిశ్చయంతో ఉన్నామన్నారు నారా లోకేష్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఎఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.