జనం ఛీ కొట్టినా మారని జగన్ – లోకేష్
11 సీట్లకే పరిమితం చేసినా ఆరోపణలేనా
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు.
రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పాలన సాగించిన జగన్ రెడ్డి అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడని, తాము వచ్చాక పరిస్థితిని చక్క దిద్దేందుకు నానా తంటాలు పడుతున్నామని స్పష్టం చేశారు. అందుకే ప్రజలు ఛీ కొట్టారని, వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని అది కూడా తెలుసు కోకుండా పదే పదే టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
ప్రజలకు ఆశ చూపి చంద్రబాబు దగా చేశారన్న జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచేందుకు 5 ఏళ్లు తీసుకొని సంక్షేమం గురించి మాట్లాడుతున్నావా అని ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఇకనైనా జగన్ తన వైఖరిని మార్చు కోవాలని లేక పోతే ప్రజలే తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు నారా లోకేష్.