నోటీసులకే రాజకీయ సన్యాసం చేస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్
అమరావతి – వైసీపీ నేతలపై సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల జగన్ రెడ్డి సర్కార్ హయాంలో తమ పార్టీకి చెందిన వారిని ఎక్కువగా టార్గెట్ చేశారని ఆరోపించారు. అయినా తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు , సీనియర్లు సైతం ఎంతో ఓర్చుకుని ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. వారి ధైర్యానికి తాను సలాం చేస్తున్నానని స్పష్టం చేశారు.
తాను పాదయాత్ర చేపట్టిన రోజు నుంచే చెబుతూ వస్తున్నానని, కాలం ఎవరి కోసం ఆగదని, కానీ అధికారం ఏ ఒక్కరి స్వంతం కాదని , అయినా జగన్ రెడ్డి ఆయన బ్యాచ్ పట్టించు కోలేదన్నారు. చివరకు 11 సీట్లకే పరిమితం చేశారని, అయినా వైసీపీ నేతలకు ముఖ్యంగా ఆ పార్టీ బాస్ కు ఇంకా జ్ఞానోదయం కాక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
అక్రమంగా కేసులు పెట్టినా, వేధింపులకు గురి చేసినా , జైలుపాలు చేసినా ఎక్కడా తమ వాళ్లు తగ్గలేదన్నారు. మరింత ముందుకు వెళ్లారని, కలిసికట్టుగా భారీ మెజారిటీని తీసుకు వచ్చేలా కృషి చేశారని కితాబు ఇచ్చారు.
వైసీపీ అసభ్య పోస్టులకు పోలీసులు నోటీసులు మాత్రమే ఇస్తున్నారని కానీ వాటికే భయపడి రాజకీయ సన్యాసం తీసుకోవడం తనను మరింత ఆశ్చర్య పోయేలా చేస్తోందన్నారు నారా లోకేష్. ఆయన పోసాని కృష్ణ మురళిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ తమ ప్రభుత్వం వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.