డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డా
జగన్ రెడ్డిపై నారా లోకేష్ కన్నెర్ర
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన ఏపీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందించారు. సీఎం జగన్ రెడ్డి మాఫియాకు లీడర్ గా మారాడని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందని అన్నారు.
ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలి పోవడంతో ఆఖరి గడియల్లో వైసిపి చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయని ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డడం తనను కలవరానికి గురి చేసిందన్నారు నారా లోకేష్.
విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జగన్ గ్యాంగ్ ఎంత బరి తెగిస్తుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అని ఆరోపంచారు.
గతంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బినామీకి చెందిన ఓ డబ్బా కంపెనీ పేరుతో వచ్చిన 21వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న విషయం మరిచి పోక ముందే మరో వ్యవహారం వెలుగు చూడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగి పోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూ వస్తోందన్నారు. ఈ చీకటి వ్యవహారాలను బయట పెట్టామన్న అక్కసుతోనే గతంలో వైసిపి మూకలు టిడిపి కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి తెగబడ్డాయని ఆరోపించారు. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు… డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్ అంటూ ఎద్దేవా చేశారు.