ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించని వైనం
అమరావతి – ఏపీ సీఐడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మంగళవారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని స్పష్టం చేశారు నారా లోకేష్.
సిట్ ఆఫీస్ వద్ద హెరిటేజ్ పత్రాలను దగ్ధం చేయడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీ సీఐడీ ఇలాంటి నీతి మాలిన, చట్ట విరుద్దమైన పనులు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్.
ఇది ఎంత మాత్రం న్యాయ బద్దం కాదని పేర్కొన్నారు. జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని ఆరోపించారు. తాము ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‍లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జెపిఎస్ (జగన్ పోలీస్ సర్వీస్)గా రూపాంతరం చెందారని ఆరోపించారు. తమ కుటుంబంపై బురద జల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలకు విరుద్దంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసి పోవడంతో చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగుల బెడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్.