నన్ను ఓడించేందుకు రూ.300 కోట్లు
సంచలన ఆరోపణలు చేసిన లోకేష్
మంగళగిరి : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా జరగబోయే శాసన సభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో తనను ఓడించేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 300 కోట్లు పంపించాడని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , తమ విలువైన ఓటును జాగ్రత్తగా వేయాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట, ప్రాతూరు చర్చిసెంటర్, మెల్లెంపూడి మసీదు వద్ద నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం వస్తే పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని వైసిపి పేటిఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘనత ఒక్క టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత జగన్ దేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగానే కాకుండా మద్యానికి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు.