గంజాయి కేంద్రంగా ఉత్తరాంధ్ర
నిప్పులు చెరిగిన నారా లోకేష్
నర్సీపట్నం – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ ను ఏకి పారేశారు. శంఖారావం సభ సందర్బంగా నర్సీపట్నంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు లోకేష్.
ఉత్తరాంధ్రను వైసీపీ గంజాయికి కేరాఫ్ గా మార్చిందంటూ ఆరోపించారు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని అభివృద్దికి కేంద్రంగా మారిస్తే జగన్ రెడ్డి వచ్చాక సీన్ మారి పోయిందన్నారు.
నర్సీపట్నం తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా అభివర్ణించారు నారా లోకేష్. అయ్యన్న పాత్రుడిపై ఎన్నో కేసులు పెట్టారని, అయినా వైసీపీ సర్కార్ ఒక్క కేసును కూడా నిరూపించ లేక పోయిందన్నారు . ఉత్తరాంధ్రను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయ సాయి రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు దర్జాగా దగా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్.
నవ రత్నాలు పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ఇకనైనా వైసీపీ తన తీరు మార్చు కోవాలని లేక పోతే ఛీ కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు.