అధికారం పోయినా అహంకారం తగ్గలేదు
ఎంపీ విజయ సాయి రెడ్డిపై నారా లోకేష్
మంగళగిరి – ఏపీ ఐటీ, విద్య, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వైసీపీ రాజ్య సభ సభ్యుడు , సీనియర్ నాయకుడు విజయ సాయి రెడ్డిపై నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీరియస్ గా స్పందించారు.
రాజకీయాలలో ఉంటున్న నాయకులు ఆదర్శ ప్రాయంగా ఉండాలే తప్పా అదుపు తప్పి నోటికి ఎంత వస్తే అలా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఒకవేళ ఆరోపణలు వస్తే వాటిని నిరూపించు కునేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయని, వాటిపై ఫోకస్ పెట్టకుండా మీడియా ప్రతినిధులను పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా లోకేష్.
దీనిని తాను ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. చిన్న వాడిగా మీకు మంచీ మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదని పేర్కొన్నారు. మీకు అధికారం పోయినా ఇంకా అహంకారం పోలేదని తేలి పోయిందన్నారు. ఇకనైనా ఎంపీనని మరిచి పోవద్దని సూచించారు. ప్రజలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలే తప్పా చీదరించుకునేలా వ్యవహరించ కూడదని హితవు పలికారు నారా లోకేష్.