జగన్ చాప్టర్ క్లోజ్ – లోకేష్
పీకే సర్వే నిజమన్న నేత
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో జగన్ పనై పోయిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మార్చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఇప్పటి దాకా 12 లక్షల కోట్లకు పైగా రుణాలు తీసుకు వచ్చాడని, ఎవరి బొక్కసం లోకి వెళ్లి పోయాయో రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.
నవ రత్నాల పేరుతో ప్రజలను నిట్ట నిలువునా జగన్ రెడ్డి ముంచాడని, ఇప్పుడు ప్రతి ఒక్కరిపై ఎన్నుకున్న పాపానికి అప్పుల భారం మోపాడంటూ ఆరోపించారు లోకేష్ బాబు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.
వైనాట్ 175 అనేది దింపుడు కల్లం ఆశగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైనా వైకాపా దారుణ పరాజయాన్ని ఎవ్వరూ ఆపలేరంటూ ఎన్నికల రాజకీయ వ్యూహకర్త పీకే చెప్పాడంటూ గుర్తు చేశారు.