BUSINESSTECHNOLOGY

విశాఖ‌లో గూగుల్ క్లౌడ్ డేటా సెంట‌ర్ ఏర్పాటు చేయండి

Share it with your family & friends

గూగుల్ క్లౌడ్ సీఈవో, వైఎస్ ప్రెసిడెంట్ తో లోకేష్ భేటీ

అమెరికా – యుఎస్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్న ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. గురువారం శాన్ ఫ్రాన్సిస్కో లోని గూగుల్ క్యాంప‌స్ ను సంద‌ర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్, బికాస్ కోలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ నెట్ వర్కింగ్ రావు సూరపునేని (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ ఫామ్స్), చందు తోట (వైస్ ప్రెసిడెంట్, గూగుల్ మ్యాప్స్) లతో లోకేష్ భేటీ అయ్యారు.

గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ… ఆన్‌లైన్ రీసెర్చి, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ అడ్వర్టైజింగ్‌లో తమ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆల్ఫాబెట్ (గూగుల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్‌లుగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ హబ్ గా తయారవుతోందని అన్నారు.

విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించామ‌న్నారు. పిపిపి మోడ్ లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల‌ని కోరారు నారా లోకేష్. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంత‌మ‌ని, విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎఐ ఆధారిత ఈ-గవర్నెన్స్, స్టార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడం ద్వారా మెరుగైన పౌర సేవలు అందించేందుకు ఎఐ టూల్స్, ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్ కల్పించాల‌ని కోరారు. స్మార్ట్ సిటీల్లో జియో స్పేషియల్ సేవల్లో భాగంగా రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్, అర్బన్ ప్లానింగ్‌తో సహా స్మార్ట్ సిటీ కార్యక్రమాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించడం కోసం ఏపి ప్రభుత్వంతో కలసి పని చేయాల‌ని కోరారు.

ఏపిలో డిజిటల్ ఎడ్యుకేషన్, యువత నైపుణ్యాభివృద్ధికి ఏఐ ఆధారిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల‌ని విన్న‌వించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఎఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, స్మార్ట్ సిటీ సామర్థ్యాలను మెరుగు పరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు స్పందిస్తూ… సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.