భారత్ కంటే చైనా ముందుంది
ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి
బెంగళూరు – ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ చైర్మన్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా భారత్ తో పోటీ పడుతున్న చైనా దేశం అనుసరిస్తున్న విధానాలపై కామెంట్స్ చేశారు.
భారత దేశం కంటే చైనా ఆరు రెట్లు ముందుందని అన్నారు. తయారీ రంగంలో వాళ్లు అందరికంటే ముందంజలో కొనసాగుతున్నారని చెప్పారు. మన కల అత్యంత సాహసంతో కూడుకుని ఉన్నదని , ఆ దిశగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో చైనాకు దగ్గరగా వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు నారాయణ మూర్తి.
విచిత్రం ఏమిటంటే ఇవాళ యావత్తు ప్రపంచంలోని అత్యధిక శాతం దేశాలన్నీ చైనా దేశంపై ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. అందులో భారత్ కూడా ఒకటి అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కంటున్న కలలను తాను తప్పు పట్టడం లేదన్నారు.
కానీ ఒక రకంగా చెప్పాలంటే చైనా ఇప్పటికే ప్రపంచంలోని కర్మాగారంగా మారి పోయిందని పేర్కొన్నారు నారాయణ మూర్తి. ఇతర దేశాలలోని సూపర్ మార్కెట్లు , హోమ్ డిపోలలో దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారవుతున్నవేనని కుండ బద్దలు కొట్టారు. చైనాను ఢీకొనాలంటే మనం ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు.