నీట్ యుజి 2024 కౌన్సెలింగ్ వాయిదా
తదుపరి నోటీస్ ఇచ్చేంత వరకు
న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సర్కార్ చేసిన నిర్వాకం కారణంగా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది నీట్ వ్యవహారం. ఇప్పటికే ఈ సమస్య కోర్టు దాకా చేరింది. దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ ను రాశారు.
తీరా ఫలితాలు వచ్చాక అసలైన కుంభకోణం వెలుగు చూసింది. భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలింది. ఇందుకు సంబంధించి పేపర్ స్కామ్ దొంగలను పట్టుకునే పనిలో పడింది కేంద్ర దర్యాప్తు సంస్థలు.
ఇదే సమయంలో పార్లమెంట్ లో కూడా చర్చించాలని పట్టు పట్టాయి ప్రతిపక్షాలు. ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. తాజాగా శనివారం కీలక ప్రకటన చేసింది కేంద్రం. నీట్ యుజీ 2024 కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు దీనిని నిర్వహించడం లేదని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఆల్ ఇండియా కోటా కింద నీట్ కౌన్సెలింగ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు స్పందించక పోవడంతో వాయిదా వేయక తప్పడం లేదని వెల్లడించింది.