తిరుపతి లడ్డూ వివాదం జనసేన ఆగ్రహం
తెలంగాణ జనసేన పార్టీ చీఫ్ వార్నింగ్
హైదరాబాద్ – తెలంగాణ జనసేన పార్టీ చీఫ్ నేమూరి శంకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం దేశ వ్యాప్తంగా రాద్దాంతం చోటు చేసుకుంది. దీనిని నిరసిస్తూ జనసేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా లడ్డూ కల్తీపై విచారణ చేపట్టాలని కోరుతూ గురువారం హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్బంగా నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదంతో పాటు ఇతర ఆలయాలలో కూడా తయారయ్యే ప్రసాదాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు నేమూరి శంకర్ గౌడ్.
తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విధంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డును మించిన హిందూ బోర్డును వెంటనే రూపొందించాలని కోరారు తెలంగాణ జనసేన పార్టీ చీఫ్. కొందరు కావాలని అవాకులు చెవాకులు పేలుతున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఇదే సమయంలో అటు ఏపీలో ఇటు తెలంగాణలో పవిత్ర పుణ్య క్షేత్రాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వాలు అన్య మతస్తులను కాకుండా హిందువులకే ప్రయారిటీ ఇవ్వాలని కోరారు నేమూరి శంకర్ గౌడ్. ఈ సందర్బంగా జగన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు . ఆయన హయాంలో ఆలయాలను పట్టించు కోలేదని ఆరోపించారు.