మహోన్నత మానవుడు రతన్ టాటా
సంతాపం వ్యక్తం చేసిన నేరెళ్ల శారద
హైదరాబాద్ – భారతీయ దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. గురువారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.
నాలాంటి వారికే కాదు యావత్ 143 కోట్ల మంది భారతీయులను శోక సంద్రంలో ముంచేసి వెళ్లి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశానికి టాటా గ్రూప్ సంస్థ ద్వారా ఎనలేని పేరు తీసుకు వచ్చేలా చేసిన వ్యాపార దిగ్గజం రతన్ టాటా అని కొనియాడారు నేరెళ్ల శారద.
వ్యాపారం అంటే ఆదాయం కోసం కాదని, దానికి కూడా విలువలు అంటూ ఉండాలని స్పష్టం చేయడమే కాదు ఆచరించి చూపించిన గొప్ప వ్యాపారవేత్త, అంతకు మించిన దయ గల మానవుడు అని ప్రశంసలు కురిపించారు.
రతన్ టాటా లేని లోటు తీర్చ లేనిదని, ఆయన మరణం దేశానికి తీరని నష్టమని పేర్కొన్నారు నేరెళ్ల శారద. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వం, వినయం, దేశ నిర్మాణం పట్ల నిబద్ధత తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని స్పష్టం చేశారు.
రతన్ టాటా కుటుంబానికి, టాటా గ్రూప్ మొత్తానికి నా హృదయ పూర్వక సానుభూతి. భారతదేశం నిజమైన రత్నాన్ని కోల్పోయిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు చైర్ పర్సన్.