శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు
అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల – శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం తాను అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. శనివారం ఆయన నూతన అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టారు.
అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణ దారులు వేదాశీర్వచనం చేశారు.
తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు, స్వామి వారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచం నలు మూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతి రోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహ పూర్వకంగా అందిస్తామని చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్, ప్రశాంతి, సీపీఆర్వో డాక్టర్ టీ.రవి తదితరులు పాల్గొన్నారు.