DEVOTIONAL

కొలువు తీరిన టీటీడీ పాల‌క మండ‌లి

Share it with your family & friends

ప్ర‌మాణ స్వీకారం చేసిన చైర్మ‌న్ , సభ్యులు

తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వ‌యంభూ వరహాస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు.

ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో జె.శ్యామలరావు బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగ నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామి వారి ప్రసాదం, చిత్రపటం, టీటీడీ డైరీలు, క్యాలెండర్ లు అందించారు.

అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులుగా దేవాదాయశాఖ సెక్రటరీ సత్య నారాయణ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర్ గౌడ్, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఎం.ఎస్.రాజు, నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగ శ్రీ, ఆనంద్ సాయి, జానకి దేవి తమ్మిశెట్టి, ఆర్.ఎన్.దర్శన్, ఎం.శాంతారామ్, ఎస్.నరేష్ కుమార్, డాక్టర్ ఆదిత్ దేశాయ్ లు ప్రమాణం స్వీకారం చేశారు.

వీరిచే టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. వీరికి రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందించగా అధికారులు శ్రీవారి చిత్ర పటం, డైరీలు, క్యాలెండర్లు అందజేశారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు పి.రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, ప్రశాంతి, భాస్కర్ లు పాల్గొన్నారు.