లగచర్ల ఘటనపై హక్కుల కమిషన్ ఆరా
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కోడంగల్ శాసన సభ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల లో చోటు చేసుకున్న ఘటనపై సీరియస్ అయ్యింది జాతీయ మానవ హక్కుల కమిషన్.
ఈ ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)తో పాటు బంజారా, గిరిజన, మానవ హక్కుల సంఘాల నేతలు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. అక్రమంగా గిరిజనుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.
అన్యాయంగా బాధితులైన రైతులను అక్రమంగా జైలుపాలు చేశారని, నిజ నిర్ధారణ సంఘం సభ్యులను, జర్నలిస్టులను, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను లగచర్ల గ్రామానికి వెళ్లకుండా ఖాకీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయారు.
ఈ మొత్తం ఘటనపై ఆధారాలతో సహా సమర్పించడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిందిన కమిషన్ రెండు వారాల్లోగా రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది.