సంధ్య థియేటర్ కేసుకు సంబంధించి
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సీ ) నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ కు స్పష్టం చేసింది కమిషన్.
ఇదిలా ఉండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా, శ్రీలీల కలిసి నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ చని పోయింది. తన కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా పడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. ఇదే కేసులో నటుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.