మంత్రి నిమ్మల రామా నాయుడు పిలుపు
ఇరిగేషన్ పనులు, నిర్వహాణ, మరమ్మత్తుల కోసం చంద్రబాబు విడుదల చేసిన రూ.344 కోట్లు సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.
ప్రాజెక్టుల పనుల ప్రగతిపై సమీక్ష చేపట్టారు. ఓ అండ్ ఎం పనుల పై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వందల, వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్స్ నిర్మిస్తే గత ప్రభుత్వం మెయింటెన్స్ కూడా లేకుండా గాలికి వదిలేసిందంటూ ఆరోపించారు.
తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనులు కోసం 10 లక్షలు దాటితే, కాలయాపన లేకుండ 7 రోజుల్లోనే పూర్తయ్యేలా, షార్ట్ టెండర్లు పిలవాలని ఆదేశించామన్నారు. రూ.10 లక్షల లోపు ఉన్న పనులను, సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని తెలిపారు.
గత ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్ట మట్టి తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మత్తులు చేయకపోగా, గ్రీజు కూడా పెట్టలేదంటూ ఆరోపించారు నిమ్మల రామా నాయుడు. గత ప్రభుత్వం తప్పిదాలను సరి చేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు.2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలాఖరుకు పూర్తయ్యే లక్ష్యంగా నిర్వహాణ, మరమ్మత్తు పనులను చేపట్టాలన్నారు. .
పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమీషనర్ రాంసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరావు, ఈఎన్సీ నరసింహామూర్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిఈ లు, ఎస్ఈ లు ఇతర ఉన్నత్తాధికారులు హాజరయ్యారు.