బీఆర్ఎస్ ఫీనిక్స్ పక్షి లాంటిది
నిప్పులు చెరిగిన నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆనాడు అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలు ఇచ్చారని తీరా ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కారు కూతలు కూయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారంటూ నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అంటూ చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పాలనా పరంగా ఎందుకు వైఫల్యం చెందుతోందనే దానిపై ఆ పార్టీ హై కమాండ్ కమిటీ వేసిందన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని నిలదీశారు .
వైఎస్ హయాంలో ఎంతో మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నా బీఆర్ఎస్ ను ఏమీ చేయలేక పోయాడని, ఎంత మందిని చేర్చుకున్నా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. గులాబీ పార్టీ ఫీనిక్స్ పక్షి లాంటిదని , పడిన ప్రతి సారి తిరిగి లేస్తుందన్నారు నిరంజన్ రెడ్డి.