సీఎంపై సింగిరెడ్డి సీరియస్
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు.
ఆచరణకు నోచుకోని హామీలను ఇవ్వడం, అబద్దాలను చెప్పడం, ప్రజలను మోసం చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు నిరంజన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారని, తీరా ఆరు నెలలు పూర్తి అయినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా జమ చేసిన దాఖలాలు లేవన్నారు .
రైతు రుణ మాఫీకి 31 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు సీఎంకు సోయి అంటూ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం తాము నాలుగున్నర లక్షల కోట్లు అందజేశామని చెప్పారు. వాస్తవాలు తెలుసు కోకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు నిరంజన్ రెడ్డి.