ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భారీ విరాళం
అన్న క్యాంటీన్ల కోసం అందజేసిన భువనేశ్వరి
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్దరించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు.
పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువతీ యువకులకు ఆకలిని తీర్చే విధంగా ఏ ఒక్కరు పస్తులు ఉండ కూడదనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఇదే సమయంలో మరో 99 అన్న క్యాంటీన్లను కొత్తగా ప్రారంభించారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్లకు భారీ ఎత్తున విరాళాలను అందజేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు నుంచి చైర్మన్ గా ఉన్న నారా భువనేశ్వరి రూ. 1 కోటిని మంత్రి నారాయణకు అందజేశారు. ఈ సందర్బంగా పేదల ఆకలి తీర్చడమే తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉద్దేశమని దానిని తాము కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.