రాయబరేలి బరిలో నూపుర్ శర్మ
ప్రియాంక గాంధీ పోటీలో నిలిచే ఛాన్స్
న్యూఢిల్లీ – వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కోర్టుతో చీవాట్లు తిన్న భారతీయ జనతా పార్టీ నాయకురాలు నూపుర్ శర్మ మరోసారి సంచలనంగా మారారు. ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశమంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 545 లోక్ సభ స్థానాలకు గాను తొలి విడతగా 195 సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
అయితే రెండో జాబితాలో బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలీ లోక్ సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థినిగా నిలబెట్టాలని నిర్ణయించినట్లు విశ్వ సనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.
ఇదిలా ఉండగా ఇదే లోక్ సభ స్థానం నుంచి ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ గత 20 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అనారోగ్యం దృష్ట్యా ఈసారి రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో వైపు నూపుర్ శర్మ ఢిల్లీ యూనివర్శిటీ లో జరిగిన యూనియన్ ఎన్నికల్లో 2008లో ఏబీవీపీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థిగా గుర్తింపు పొందారు.