గ్యాస్ వినియోగదారులకు షాక్
చమురు కంపెనీల ధరాఘాతం
హైదరాబాద్ – గ్యాస్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి చమురు కంపెనీలు. తాజాగా కీలక ప్రకటన చేశాయి. తక్షణమే అమలులోకి వచ్చేలా ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వారికి ఇబ్బంది పెట్టేలా ధరలను పెంచాయి.
డిసెంబర్ 1 ఆదివారం రోజు నుంచే ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రక్రటించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ కొత్త రిటైల్ ధర రూ.1,818.50 గా ఉంది.
అదనంగా, 5-కేజీల ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్ల ధర కూడా రూ.4 పెరిగింది. కాగా 14.2-కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధర పెంచలేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. ఇప్పటికే వెయ్యి రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ల ధరలు ఉన్నాయి. సామాన్యులకు ఆశనిపాతంగా పరిణమించాయి చమురు కంపెనీల నిర్ణయాలు.