స్టీల్ రీబార్ కు ప్రత్యామ్నాయంగా జి ఎఫ్ ఆర్ పీ రీబార్
హైదరాబాద్ – మౌలిక సదుపాయాల రంగంలో ప్రముఖ ఎలెక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా కీలకమైన సాంకేతిక పురోగతిని సాధించింది. కాంక్రీట్ లో వినియోగించే స్టీల్ రీబార్ కు ప్రత్యామ్నాయంగా అత్యాధునిక గ్లాస్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్డ్ పాలిమర్ రీబార్ (జీఎఫ్‌ఆర్‌పీ)ని ఆవిష్కరించింది. ఈ ఆవిష్కరణ నిర్మాణ రంగంలో కాంక్రీట్ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌లో ఒక నూతన శకాన్ని నెలకొల్పటంతో పాటు, అసమానమైన బలం, మన్నిక , సుస్థిరతను అందిస్తుంది. హైదరాబాద్ లో జరుగుతున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) వార్షిక బడ్జెట్ సమావేశాల్లో సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి జీ ఎఫ్ ఆర్ పీ రీబార్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా సీఎండీ .కేవి. ప్రదీప్, మేఘా గ్రూప్ డైరెక్టర్లు సి.హెచ్. సుబ్బయ్య, బి. శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈసీఆర్ గ్లాస్ ఎపాక్సీ రెసిన్ మిశ్రమంతో తయారు చేసిన ఒలెక్ట్రా ఎఫ్‌ఆర్‌పీ రీబార్, సాంప్రదాయ ఉక్కుతో పోలిస్తే గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 950–1100 ఎంపీఏ బలం కలిగి ఉంటుంది. ఇది సాంప్రదాయ ఉక్కు కన్నా దాదాపు రెట్టింపు బలం. ఉక్కు కన్నా నాలుగు రెట్లు తేలికగా ఉంటుంది. దీని నిర్వహణ, రవాణా సులభంగా ఉంటుంది. తుప్పు పట్టని, అయస్కాంత రహిత, విద్యుత్ ప్రసరించని, నీటిలో తడిచినా పాడుకాని లక్షణాలు అననుకూల వాతావరణంలో వినియోగానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ ఈ విప్లవాత్మక ఉత్పత్తిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది, నిర్మాణ రంగంలో ఒలెక్ట్రా అధికారిక ప్రవేశాన్ని ఇది సూచిస్తుంది. అత్యుత్తమ ప్రయోజనాలతో కూడిన ఒలెక్ట్రా జీఎఫ్‌ఆర్‌పీ రీబార్ వినియోగం వల్ల ఖర్చు ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తక్కువ. నిర్మాణాల జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. . దీనిని ఇండస్ట్రియల్ ఫ్లోరింగ్, పేవ్‌మెంట్లు , వంతెన డెక్‌లు, ప్రీకాస్ట్ నిర్మాణాల్లో వినియోగించవచ్చు. పర్యావరణ అనుకూల తుప్పు పట్టని ఒలెక్ట్రా జి ఎఫ్ ఆర్ పీ సముద్ర సంబంధమైన ప్రాజెక్ట్ లలో ఉపయోగించే సాధారణ ఉక్కుకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు.