రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు
25న విచారణకు హాజరు కావాలని ఆదేశం
అమరావతి – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే హైకోర్టు నుంచి తిరస్కరణ ఎదురైంది. తనకు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పై కోర్టుకు వెళ్లాలని అనుకుంటే వెళ్ల వచ్చని సూచించింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి మరోసారి పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేయడం విశేషం.
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రూరల్ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పేర్కొన్నారు ఆ నోటీసులో.
ఈనెల 25న తమ వద్దకు విచారణ నిమిత్తం రావాలని పేర్కొన్నారు. ఆర్జీవీ ఉపయోగిస్తున్న వాట్సాప్ నెంబర్ కు నోటీసు పంపించినట్లు రూరల్ సీఐ శ్రీకాంత్ వెల్లడించారు. అయితే ఈనెల 19న మంగళవారం ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సి ఉంది. అయితే తనకు వేరే పనులు ఉన్నాయని, వారం రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ రెచ్చి పోయారు. ఆపై వ్యూహం పేరుతో మూవీ తీశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను మార్ఫింగ్ చేసి అవమానించారని ఫిర్యాదు అందింది రామ్ గోపాల్ వర్మపై.