గాడి తప్పిన మోడీ పాలన – చిదంబరం
నిప్పులు చెరిగిన కేంద్ర మాజీ మంత్రి
తమిళనాడు – మాజీ కేంద్ర మంత్రి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 240 సీట్లతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు.
ఆర్థిక నేరస్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. గౌతమ్ అదానీ చేసిన పనికి ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి ఉన్న పరువు పోయిందన్నారు. ఆయనకు ఎవరు మద్దతు ఇస్తున్నారనేది దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.
ప్రభుత్వ పరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ పరిష్కారానికి నోచు కోవడం లేదన్నారు పి. చిదంబరం. ఇది దేశానికి ప్రధాన సమస్యగా మారిందని వాపోయారు. ప్రభుత్వం బలంగా ఉన్నప్పటికీ బలహీనమైన నాయకత్వం ఉండడం దౌర్భాగ్యకరమని పేర్కొన్నారు.
దేశాన్ని నడిపే విధానంలో ఎలాంటి మార్పు లేక పోవడం ప్రజల పాలిట శాపంగా మారిందని వాపోయారు చిదంబరం. ఓటర్లు మారినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన పరివారంలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మారాల్సిన అవసరం ఉందన్నారు.