చివరి దాకా ప్రకృతి ప్రేమికుడిగా
ఖమ్మం జిల్లా – కోటికి పైగా మొక్కలు నాటిన ఖమ్మం వాసీ వనజీవి రామయ్య ఇక లేరు. ఆయనకు 10 ఏళ్ల కిందటే పద్మశ్రీ దక్కింది. గత ఐదు దశాబ్దాలుగా మొక్కలు నాటుతూ ప్రకృతి ప్రేమికుడిగా పేరు గడించారు. గత అర్ధరాత్రి పద్మశ్రీ వనజీవి రామయ్యకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు.
వనజీవి రామయ్య స్వస్థలం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామం. తన జీవితాంతం చెట్లను నాటడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితం చేశారు. రామయ్య వయసు 88 ఏళ్లు. 2017లో, సామాజిక అటవీ సంరక్షణ కోసం చేసిన కృషిని గుర్తించింది కేంద్రంలోని మోదీ సర్కార్. ఈ మేరకు అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందజేసింది. నీడ, పండ్లు, జీవ ఇంధనాన్ని అందించే స్థానిక చెట్లపై దృష్టి సారించారు. ఖమ్మం, చుట్టు పక్కల లక్షకు పైగా మొక్కలను నాటారు. చెట్ల రామయ్య (చెట్లు రామయ్య) అని పిలువబడే ఆయన తరచుగా మొక్కలు, విత్తనాలతో నిండిన జేబులు, బంజరు భూములను పచ్చగా మార్చాలనే లోతైన లక్ష్యంతో సైకిల్ తొక్కుతూ కనిపించేవారు.
10వ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ, రామయ్య మొక్కలపై లెక్కలేనన్ని పుస్తకాలు చదివి స్వయం ఉపాధి నిపుణుడిగా మారాడు. విత్తనాలు, మొక్కలు కొనడానికి తన 3 ఎకరాల భూమిని కూడా అమ్మేశాడు.