DEVOTIONAL

తిరుమ‌ల‌లో ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు

Share it with your family & friends

మే 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ

తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. భ‌క్తుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ . తిరుమ‌ల‌లో మే 17 నుండి 19వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి ప‌రిణయోత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఈ వేడుకలో తొలిరోజు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనం, రెండవ రోజు అశ్వ వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఇదిలా ఉండ‌గా శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాలు సంద‌ర్భంగా ఈ మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలి వచ్చారు.

ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణ వనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.