విశేషంగా ఆకట్టుకున్న భక్తి వాద్య సంగీతం
తిరుమల – శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు తిరుమలలో ఘనంగా ముగిసాయి.శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు.
తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల లోకనాథరెడ్డి, లావణ్య బృందం ఆలాపించిన పసిడి అక్షింతలవి…, చూడరమ్మ సతులాల, తెలిసిన వారికి దేవుడితడి, తదితర అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.ఈ కార్యకమంలో టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు, ఈవో జెశ్యామలరావు దంపతులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.