టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
అమరావతి – సింహాచలం భూముల విషయంలో ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేసిందన్నారు టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు. 12 వేల 149 కుటుంబాలకు న్యాయం చేయాలి అనే ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయమన్నారు. కానీ ఈ ప్రభుత్వం 420 ఎకరాలకు గాను 610 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడిందని చెప్పారు.
దేవస్థానంకు సంబంధించి భూములను అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాము వచ్చాక విచారణ ప్రారంభించామన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు పల్లా శ్రీనివాస రావు.
ఎంతసేపు దేవస్థానం భూములు ఎక్కడున్నాయా ఎలా దోచేద్దామా అని ఆలోచనతో పాలన సాగించారని ధ్వజమెత్తారు . ప్రజల్ని, దేవస్థానంని ఇబ్బంది పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, విజయనగర సంస్థానాధీశులు అశోక్ గజపతిరాజుకి సైతం తెలియ చేయటం జరిగిందన్నారు.
దేవస్థానం సంబంధించి స్వామి వారికి గంధం పెంచే విధంగా కావాలని కోరారని, దానికి సైతం కూటమి సర్కార్ ఒప్పుకుందన్నారు. ఈ భూములకు, నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని, మూడు నెలల్లో పరిష్కారం అవుతుందని , ఆ తర్వాత సమస్య క్లోజ్ చేస్తామన్నారు.