జగన్ రెడ్డిపై భగ్గుమన్న టీడీపీ చీఫ్
ఇంకెంత మందిని బలిగొంటారని ప్రశ్న
అమరావతి – వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి రక్త దాహానికి ఇంకెంతమంది టీడీపీ నేతలు బలి కావాలని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లాలో టీడీపీ నేత హరి ప్రసాద్ దారుణ హత్యను ఖండిస్తున్నామని అన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కక్ష సాధింపు ధోరణికి స్వస్తి పలకాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు పల్లా శ్రీనివాస రావు.
చిల్లకూరు మండలం నాంచారంపేటలో తమ పార్టీకి చెందిన నేత హరి ప్రసాద్ ను హత్య చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో జీర్ణించుకోలేని వైసీపీ రౌడీ మూకలు తెలుగుదేశం క్యాడర్ పై దాడులు, హత్యలకు తెగబడుతున్నారని ఆరోపించారు .
గ్రామంలోని పొలం విషయంలో టీడీపీ వర్గీయులతో గొడవ పడి కక్ష గట్టి ఈ హత్య చేశారని మండిపడ్డారు. హరి ప్రసాద్ ఇంట్లో నిద్రపోతుండగా వైసీపీ నేత రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దాడికి తెగబడ్డారని ఆరోపించారు.
హరి ప్రసాద్ పై పెట్రోల్ పోసి దారుణంగా హత మార్చారని వాపోయారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న వారిపైన రాడ్లు, కర్రలతో దాడి చేసి గాయ పరిచారని మండిపడ్డారు పల్లా శ్రీనివాస రావు. టీడీపీకి చెందిన కాటయ్య ఇంటిపైనా వైసీపీకి చెందిన మధు, అతని అనుచరులు దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమెత్తారు.
రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు చేయడంలో జగన్ రెడ్డినే వైసీపీ క్యాడర్ ఆదర్శంగా తీసుకుంటోందని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.