శ్రీ చైతన్య సరే నారాయణ మాటేంటి..?
నేరెళ్ల శారద కు పిల్లల పేరెంట్స్ విన్నపం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద చర్చనీయాంశంగా మారారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలే కాకుండా నారాయణ, గౌతమి, తదితర విద్యా సంస్థల అడ్డగోలు దోపిడీపై కూడా దృష్టి సారించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు ఆమెను అభినందిస్తున్నారు. ఫీజుల పేరుతో నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యా సంస్థల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లు వెనకేసుకుంటూ పిల్లల వరకు వచ్చేసరికి కనీస వసతులు కల్పించక పోవడంతో పాటు తినేందుకు తిండి సైతం సరిగా పెట్టడం లేదన్న విమర్శలు లేక పోలేదు.
గత కొన్ని రోజులుగా శ్రీచైతన్య మహిళా కాలేజీలో జరుగుతున్న విద్యార్థినిలకు సంబంధించిన సమస్యలు పలు మీడియాలో రావడం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో సీరియస్ గా తీసుకున్న కమిషన్ చైర్మన్ నేరళ్ల శారద మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేయడం అభినందనీయం.
కాలేజీ ప్రాంగణంలోనూ విద్యార్థినిల హాస్టళ్లు, మెస్ లను తనిఖీ చేసి నాసిరకమైన ఫుడ్, హాస్టల్ లలో సౌకర్యాలు సరిగా లేవని గుర్తించి కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అదే విధంగా అక్కడి విద్యార్థిలతో కాసేపు మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు .
శ్రీ చైతన్య యాజమాన్యానికి సమన్లు పంపిన మహిళా కమిషన్. పిల్లల భద్రత పైన రాజీపడే ప్రసక్తి లేదని , ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నేరెళ్ల శారద. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, గౌతమి, తదితర విద్యా సంస్థలపై కూడా ఆకస్మిక తనిఖీలు చేయాలని కోరుతున్నారు పేరెంట్స్.